అమ్మా అమ్మోరు తల్లి!
నీ తీర్పులు విన్న వాడ్ని కనుకే ఈ ఓర్పు.
అమ్మా ..
నిన్నే రూపాన కొలుస్తే ఆ రూపాన దయ దలుస్తావు.
ఒక నేత జీసస్ గా కొలుస్తే అతనికి విజయాన్ని
ప్రసాదించి జీవన్ముక్తుడ్ని చేసావు
ఒక నటుడు హనుమన్నగా కొలుస్తే అతనికి అపజయాన్ని
ప్రసాదించి ప్రాణ భిక్ష పెట్టావు.
మంచివానికి మంచి రోజులొచ్చినప్పుడు
కాసింత స్వార్థం,లౌక్యం, నేర్పి సెటిల్ చేస్తావు
దొడ్డవారికి చెడ్డ రోజులొచ్చినప్పుడు
కాసింత పెద్దరికం,పెగ్గి నూరి పోసి కుదేలు చేస్తావు.
నీ తీర్పు నాలో తెచ్చిన మార్పు అంతా ఇంతా కాదు
నీ ఈ సృష్ఠిలో ఏదీ వింతా కాదు .. నాలో చింతా రాదు
నా గమ్యమేమిటో నిర్దేశించావు -నాకు ఉపదేశించావు
మరి మార్గం?
ఏ నరకాన్ని సైతం స్వర్గంగా మలచుకునే సత్తా ఉన్నా మానవుడు
ఈ భూగ్రహాన్ని సైతం నరకం చేస్తుంటే
మరి ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలనే - కయ్యాలకు కాలు దువ్వాను
దెయ్యాలకు ఎదురు తిరిగాను
పొట్ట చేత పట్టి నడిచినప్పుడెల్లా జారిపోని లక్ష్యం
ప్రియుని బిగి కౌగిలినుండి జారుకునే తెలుగు స్త్ర్రీలా జారుకుంటుందేం?
అన్ని సజావుగా సాగుతుంటే వీరిలాగే నా చర్మం -మనస్సుకూడ
మొద్దు పారేట్లుంది.
మరి నాటి గుణపాఠాలు మరిచి - నా కోటలను భీటలు వారనిచ్చి
ఎందుకే ఈ కుట్ర.
మానవులు దుర్భలురని నాకు తెలుసు.
వీరికన్నా దుర్భలుడను నేనన్న సంగతీ తెలుసు.
అందుకే నాకీ మానవులన్నా నేనన్నా అంత అలుసు.
ఏం చెయ్యమంటావు?
లంఘనం పరమ ఔషదమని నా తిండిని సైతం ఒడ్డి
జూదమాడిన నన్ను స్టోర్ రూము నిండుగున్న ఈ రోజున
ఊరికే కాలం వెళ్ళ బుచ్చమంటావా?
ఈ పుడమి తల్లికి వీరు తలకొరివి పెట్టేస్తుంటే
చూస్తూ ఊరుకోమంటావా?
ఆకలి మంటలు చెలరేగుతుంటే
శీలం - సచ్చీలత అన్నీ కాలి పోతుంటే
నోట వేలేసుకుని ఉండి పొమ్మంటావా?
అమ్మా! ఆజ్నాపించు..
నీవిచ్చిన ఆజ్నలనుకునే తిరగబడ్డాను
ఇలా విరిగి పడ్డాను - నీ అమృత వీక్షణంతో
చిగురించాను.
ఏ చెట్టు కొమ్మగానో ఉండి ఎగిరి పడే రోజులకన్నా
విరిగి పడి - ఈ ప్రజలు విరగపడి నవ్వేలా చేసి - చిగురించిన
తరువాత ఉన్న నేను నీ చేతి త్రిశూలం కాగలనేమో?
హే ధర్మ స్వరూపిణి!
నీ రాకను చాటగల నీ కాలి గొలుసులోని మువ్వని కాగలనేమో?
అమ్మా! ఎన్నో సార్లు వినిపించావు నీ తీర్పు.
ఈ ఒక్కసారి వినిపించు..
మరిచిపోయిన పాఠాలన్ని హఠాత్తుగా గుర్తుకు రావాలి
ఇటీవలే నాలో చోటు చేసుకుంటున్న
మందత్వం, బోలుతనం మశి కావాలి
ఓం శక్తి
0 comments:
Post a Comment